: చాలా చోట్ల మురికి నీరు, మంచి నీరు కలసి సరఫరా అవుతోంది: కేసీఆర్
'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమం విజయవంతమయిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాదులోని 'ఎంసీఆర్ హెచ్ఆర్డీ'లో స్వచ్ఛ హైదరాబాద్ పై కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, కంటోన్మెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నగరంలో 390 కిలోమీటర్ల పొడవైన 72 నాలాల పరిస్థితి బాగాలేదని... వర్షపు నీరు వెళ్లాల్సిన నాలాల్లో మురికి నీరు వెళుతోందని చెప్పారు. నాలాల నీళ్లలోకి కూడా కట్టడాలు వచ్చాయని తెలిపారు. వీటన్నింటినీ సరిచేస్తామని అన్నారు. అలాగే, నగరంలో చెత్త తరలింపు సమస్య కూడా తీవ్రంగా ఉందని... నగరానికి 50 కి.మీ. దూరంలో చెత్త డంపులను ఏర్పాటు చేస్తామన్నారు. చాలా చోట్ల మంచి నీరు, మురుగు నీరు కలసి సరఫరా అవుతోందని... దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని కేసీఆర్ అన్నారు. ఇకనుంచి మాటలు బంద్, కేవలం పనులే జరగాలని చెప్పారు. ఎంత డబ్బైనా ఇస్తాం... రాజకీయాలకు అతీతంగా అందరు నేతలు పనులను పర్యవేక్షించాలని కోరారు. ఎంతో మంది పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ వస్తున్నారు.... ఈ క్రమంలో హైదరాబాద్ ను మంచిగా తయారు చేసుకుందామని చెప్పారు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో హైదరాబాదును సరిచేసుకోలేమని తెలిపారు.