: హన్మకొండలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న టీఆర్ఎస్ వర్గీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ చిన్నారెడ్డి ఆసుపత్రికి కూడా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. టీఆర్ఎస్ వ్యవహారశైలిని నిరసిస్తూ ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రం హన్మకొండలో కాంగ్రెస్ భవన్ ముందు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.