: మన్మోహన్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు... 2జీ వ్యవహారంలో బెదిరించారంటున్న ట్రాయ్ మాజీ చైర్మన్
ఎప్పుడూ మౌనంగా, సున్నిత మనస్కుడిగా కనిపించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మునుపెన్నడూ వినని రీతిలో ఆరోపణలు వచ్చాయి. 2జీ విషయంలో ఆయన తనను బెదిరించారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న ఆయన 'ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫామ్స్: 2జీ, పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్- ఏ ప్రాక్టీషనర్స్ డైరీ' పేరుతో ఓ పుస్తకం రాశారు. అందులోని పలు విషయాలను ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. 2జీ వ్యవహారంలో సహకరించకుంటే హాని తప్పదని అప్పటి ప్రధాని మన్మోహన్ తనను హెచ్చరించారని, తనలాంటి అధికారులు విచారణ ఎదుర్కోవడానికి ప్రధాన కారకుడు ఆయనేనని ఆరోపించారు. అప్పట్లో టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియామకాన్ని తాను వ్యతిరేకించానని, కానీ మన్మోహన్ సింగ్ తన ఆందోళనను పట్టించుకోలేదని పేర్కొన్నారు. టెలికాం విభాగానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాని, టెలికాం మంత్రే తీసుకునే వారని, వాటిని తు.చ తప్పకుండా పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని మారన్ తనను బెదిరించారని బైజాల్ ఆ పుస్తకంలో వివరించారు. అలా తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పుకొచ్చారు. 2009-10లో 2జీ స్కాం వెలుగులోకి వచ్చాక ముఖ్య ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. ఇప్పటికే 2జీ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న మన్మోహన్ ప్రతిష్టను ఈ విమర్శలు, ఆరోపణలు దెబ్బతీసేవనే చెప్పాలి. మరీ వ్యాఖ్యలపై మన్మోహన్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.