: టీఆర్ఎస్ నేత హోటల్ ధ్వంసం... కొనసాగుతున్న ఓయూ విద్యార్థుల ఆందోళన
ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన 11 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. విశ్వవిద్యాలయానికి చెందిన గజం స్థలం తీసుకున్నా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఈ క్రమంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్.యాదగిరిరెడ్డికి చెందిన హోటల్ స్వాగత్ గ్రాండ్ పై ఓయూ విద్యార్థులు దాడి చేశారు. రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. హోటల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ భూములను ఆక్రమించుకుని హోటల్ నిర్మించారని విద్యార్థులు ఈ సందర్భంగా ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ హోటల్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.