: పదేళ్ల తరువాత పడిపోయిన సబ్బు, షాంపూ, నూడుల్స్ తదితరాల అమ్మకాలు


సబ్బులు, షాంపూలు, డియోడరెంట్లు, డిటర్జంట్లతో బాటు; బిస్కెట్స్, నూడుల్స్ తదితర ప్యాకేజ్డ్ తినుబండారాలు... ఇలా వందల సంఖ్యలో ఉత్పత్తుల అమ్మకాలు పదేళ్ల తరువాత తొలిసారిగా పడిపోయాయి. వినియోగ వస్తువుల రంగంలో 2005 నుంచి రాజ్యమేలిన పలు కంపెనీల గణాంకాలు ఈ యేడు నేల చూపులు చూశాయి. హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, ఆసియన్ పెయింట్స్, నెస్లే, డాబర్, బాటా తదితర కంపెనీల అమ్మకాలు 2014-15లో 9 శాతం తగ్గాయి. యూపీఏ ప్రభుత్వం తొలిసారిగా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించిన 2004-05 తరువాత కన్స్యూమర్ గూడ్స్ విక్రయాలు తగ్గడం ఇదే ప్రథమం. గడచిన పదేళ్లలో సాలీనా ఈ రంగంలోని అమ్మకాలు 15 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయి. నికర అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయి. సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 6.1 శాతంగా నమోదైంది. దేశంలో పర్సనల్ కేర్, ప్యాకేజ్డ్ ఫుడ్, టొబాకో, ఫుట్ వేర్ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న 13 ప్రధాన కన్స్యూమర్ కంపెనీల వార్షిక గణాంకాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ కంపెనీల సమీప భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. "పలు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు పరిస్థితి మారుతుందన్న ఆశలు లేవు" అని జ్యోతీ ల్యాబొరేటరీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్. రఘునందన్ వ్యాఖ్యానించారు. అమ్మకాలు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరల ఒడిదుడుకుల నుంచి దేశవాళీ ఆర్థిక పరిస్థితుల వరకూ ప్రభావం చూపాయని తెలుస్తోంది. ఈ రంగంలోని నిర్వహణా లాభాలు ఆరేళ్ల కనిష్ఠ స్థాయిలో 12.6 శాతానికి, నికర లాభాలు పదేళ్ల కనిష్ఠస్థాయిలో 8.9 శాతం వృద్ధికి మాత్రమే పరిమితమయ్యాయి. పెరిగిన పన్నులు, సుంకాలు వినియోగ వస్తువులను ప్రజలకు దూరం చేశాయని ఐటీసీ అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందని, ఇది కూడా అమ్మకాలపై ప్రభావం చూపిందని అంచనా వేసింది. కాగా, సమీప భవిష్యత్తులో అమ్మకాలు మరింతగా తగ్గే ప్రమాదం కనిపిస్తోందని అనలిస్టులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News