: కలసికట్టుగా కదంతొక్కారు!
ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో రాంచీలో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ లో సమష్టిగా సత్తా చాటిన చెన్నై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టును చెన్నై బౌలర్లు హడలెత్తించారు. ముఖ్యంగా, లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడికి మిగతా బౌలర్ల నుంచి మెరుగైన సహకారం అందింది. దీంతో, ప్రత్యర్థిని 139 పరుగులకే కట్టడి చేశారు. బెంగళూరు జట్టులో గేల్ (41) టాప్ స్కోరర్. సర్ఫరాజ్ ఖాన్ 31, కార్తీక్ 28 పరుగులు చేశారు. డివిలియర్స్ (1), కోహ్లీ (12), మన్ దీప్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఇక, లక్ష్యఛేదనలో చెన్నై జట్టు పోరాటపటిమ కనబర్చింది. బ్యాట్స్ మెన్ బాధ్యతగా ఆడి జట్టును విజయతీరానికి చేర్చారు. ఓపెనర్ మైకేల్ హస్సీ 56 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధోనీ (26), డు ప్లెసిస్ (21) విలువైన పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో టైటిల్ కోసం ముంబయి ఇండియన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.