: పాకిస్థాన్ కు వాళ్లు అత్యంత ప్రముఖ అతిథులు!
పాకిస్థాన్ లో జింబాబ్వే జట్టు పర్యటిస్తోంది. ఆరేళ్ల విరామం తరువాత పాకిస్థాన్ లో పర్యటిస్తున్న తొలి విదేశీ జట్టు జింబాబ్వే కావడంతో వారికి వీవీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోంది. పటిష్ట భద్రత మధ్య జింబాబ్వే ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉంచుతోంది. జింబాబ్వేతో మ్యాచ్ లు నిర్వహించనున్న స్టేడియంల్లో సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. విహంగ వీక్షణం ద్వారా భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. 2009లో శ్రీలంక జట్టు స్టేడియంకు వస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ లో ఆడేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో జింబాబ్వే జట్టు పాక్ పర్యటనకు అంగీకరించి వచ్చింది. దీంతో ఆ జట్టుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పీసీబీ చర్యలు చేపట్టింది. జింబాబ్వే ఆటగాళ్లు ఉండే హోటల్ పరిసరాల్లోకి ఎవరూ అడుగుపెట్టకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. హోటల్ బయట భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. జింబాబ్వే ఆటగాళ్లు ప్రాక్టీస్ కు వెళ్లే సందర్భంలో ఆ రహదారిని దిగ్బంధించి ఆటగాళ్లను స్టేడియంకు తరలిస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో కొత్త వ్యక్తులు సంచరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి జింబాబ్వే జట్టుకు పాక్ లో వీవీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోంది.