: ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలుంటాయి: బీజేపీ నేత మురళీధర్ రావు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఆయన మోదీ పాలనపై స్పందించారు. తొలి ఏడాది పాలనలో సామాజిక భద్రత, అవినీతి రహిత పాలనకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించామని, పెట్టుబడలును ఆకర్షిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయని, ఎవరూ ఊహించని విధంగా ముందుకుపోతామని అన్నారు. ఉపాధి అవకాశాలు పెంచుతామని, నైపుణ్యాల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఇక, ఏపీ విషయంపైనా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మాట తప్పదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమని, తమది మాట తప్పే నాయకత్వం కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ పనిచేస్తుందని, బీజేపీ అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని యత్నిస్తుందని వివరించారు.