: కేంద్రం దిగిరావాలంటూ వంద రైళ్లను ఆపేశారు
కేంద్ర ప్రభుత్వం దిగిరావాలంటూ రాజస్థాన్ లోని గుజ్జర్లు తమకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఆందోళనల తీవ్రత పెంచుతున్నారు. రాజస్థాన్ లో తమకు కల్పిస్తున్న 1 శాతం రిజర్వేషన్లను 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు నిన్నటి నుంచి ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో బైఠాయించి ఆరు రైళ్లను ఆపేశారు. కేంద్ర రైల్వే శాఖ ప్రత్యామ్నాయ మార్గాల్లో రైళ్లను పంపించడంతో గుజ్జర్లు రాజస్థాన్ గుండా ప్రయాణించే రైలు మార్గాలను దిగ్బంధించారు. దీంతో సుమారు వంద రైళ్లు నిలిచిపోయాయి. రాజస్థాన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి, చర్చలకు రావాలని ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న గుజ్జర్ అర్కషాన్ సంఘర్ష్ సమితి నేతలకు లేఖలు పంపింది. లేఖలు, చర్చలతో ఉపయోగం లేదని, తక్షణం 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని, లేని పక్షంలో ఆందోళన ఆపేది లేదని ఆందోళన కారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ఏడేళ్ల క్రిందట కూడా గుజ్జర్లు ఇదే రీతిన ఆందోళన నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారితో చర్చలు జరిపి, ఆందోళనలు ఆపింది.