: హైదరాబాద్ రోడ్లపై ఇకపై చెత్త కనిపించకూడదు: సీఎం కేసీఆర్


హైదరాబాద్ లో రోడ్లపై ఇకనుంచి చెత్త కనిపించకూడదని, నగరమంతా అద్దంలా మెరిసిపోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా అందరూ జాగ్రత్తపడాలని చెప్పారు. రెండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని, ప్రజల్లో ఆ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంపై మాదాపూర్ లోని హెచ్ ఐసీసీలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో గవర్నర్ నరసింహన్, మంత్రులు, సీఎస్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేయాలని, అందుకోసం ప్రభుత్వం నగరంలోని ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు అందిస్తుందని అన్నారు. చెత్తను తొలగించేందుకు ఆటో ట్రాలీని ఏర్పాటుచేసి, వాటిని స్థానిక నిరుద్యోగులకు అప్పగిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఇళ్లమీద నుంచి ఉన్న హైటెన్షన్ లైన్లన్నింటినీ వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమైందన్నారు.

  • Loading...

More Telugu News