: అంబేద్కర్ పాట రింగ్ టోన్ గా పెట్టుకున్నాడని చంపేశారు
సంస్కరణలు ఎన్ని తెచ్చినా, సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా భారత సమాజం నుంచి కులరక్కసిని శాశ్వతంగా వేరుచేయలేమన్న ఘటన మహారాష్ట్రలోని షిరిడీలో చోటుచేసుకుంది. నర్సింగ్ చదువుతున్న సాగర్ షేజ్ వాల్ అనే విద్యార్థి బంధువుల వివాహ సందర్భంగా షిర్డీలోని తన నివాసానికి చేరుకున్నాడు. మిత్రులతో కలిసి దగ్గర్లో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. మద్యం ఆస్వాదిస్తుండగా, సాగర్ ఫోన్ రింగైంది. రింగ్ టోన్ గా సాగర్ అంబేద్కర్ పాట పెట్టుకున్నాడు. దీనిని పక్కనే ఉన్న మరో ఎనిమిది మంది విని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా, మద్యం దుకాణంలోని ఓ సీసాతో సాగర్ తలపై కొట్టారు. అంతటితో ఆగకుండా, అతడ్ని కొట్టుకుంటూ బయటికి ఈడ్చుకువచ్చి, బైక్ పై ఎక్కించుకుని దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్లి కుళ్లబొడిచారు. దాంతో అతను ప్రాణాలు వదిలాడు. తీవ్రగాయాలు కావడం వల్లే సాగర్ మరణించినట్టు పోలీసులు తెలిపారు. మద్యం దుకాణంలో జరిగిన తంతంతా సీసీటీవీ పుటేజ్ లో రికార్డైంది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు చెప్పారు.