: బీబీసీలో ప్రసారం కానున్న హైదరాబాద్ విషాదగాథ
బ్రిటీష్ పాలనలో హైదరాబాద్ స్టేట్ ఓ సామంత రాజ్యంగా ఉండేది. ఆ సమయంలో హైదరాబాదులో బ్రిటీష్ ప్రతినిధి క్రిక్ పాట్రిక్ వ్యవహరించాడు. ఆ సమయంలో ఆయనకు, రాజకుటుంబానికి చెందిన ఖైరున్నీసాకు మధ్య ప్రేమాయణం నడిచింది. వారు పెళ్లి కూడా చేసుకున్నారు, కానీ, విధి మరోలా తలచింది. వీరి కథే ఇప్పుడు బీబీసీలో ప్రసారం కానుంది. లిడియా కాన్వే అనే మహిళా దర్శకురాలు ఈ విషాద గాథను డాక్యుమెంటరీగా నిర్మిస్తోంది. దీని షూటింగ్ హైదరాబాదులోని చార్మినార్, మక్కా మసీదు, మీరాలం మండి ప్రాంతాల్లో జరిపారు. త్వరలోనే ఇది బీబీసీ టెలివిజన్ చానల్ లో ప్రసారం కానుంది. ఇక, ఈ విషాద గాథ విషయానికొస్తే... పాట్రిక్ ఉద్యోగ రీత్యా హైదరాబాదులోనే ఉండేవాడు. ఆ సమయంలో అతడికి నిజాం పాలనలో ప్రధానమంత్రిగా వ్యవహరించిన నవాబ్ మహమూద్ అలీ ఖాన్ మనవరాలు ఖైరున్నీసా పరిచయం అయింది. ఆ పరిచయం కొద్దికాలంలోనే ప్రేమగా రూపాంతరం చెందింది. తన ప్రేయసి కోసం పాట్రిక్ ఇస్లాం మతాన్ని స్వీకరించడం విశేషం. అలా, హైదరాబాదీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ బ్రిటీషర్ జీవితం కొంతకాలానికే మలుపు తిరిగింది. మనసుకు నచ్చిన భార్య, పిల్లలతో ఆనందంగా సాగిపోవాల్సిన అతడి జీవితనౌక సమస్యల తుపానులో చిక్కుకుని అల్లల్లాడింది. ఇండియాకు గవర్నర్ జనరల్ గా లార్డ్ వెల్లస్లీ వచ్చిన తర్వాత పాట్రిక్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో, అతడికి సమన్లు జారీచేశారు. ఈ క్రమంలో పాట్రిక్ కోల్ కతా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యంతో అతడు మరణించగా, భర్త మరణం ఖైరున్నీసాను పెను విషాదంలో ముంచెత్తింది. అక్కడి నుంచి ఆమె జీవితంలో చీకట్లు అలముకొన్నాయి. కొంతకాలానికి ఆమె కూడా తనువు చాలించింది. దీంతో, వారి పిల్లలను లండన్ లోని వారి తాత వద్దకు పంపేశారు బ్రిటీషర్లు. చనిపోయేనాటికి ఖైరున్నీసా వయసు 27 ఏళ్లే. అన్నట్టు... ప్రస్తుతం హైదరాబాదులో ప్రఖ్యాతిగాంచిన కోఠి ఉమెన్స్ కాలేజ్ నిర్మించింది పాట్రిక్ మహాశయుడే. అప్పట్లో దాన్ని బ్రిటీష్ రెసిడెన్సీగా వినియోగించారు. తర్వాత అందులో కళాశాల ప్రారంభించారు.