: మోదీ విజయాలపై జైట్లీ లెక్చర్!


భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సాధించిన విజయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హైలైట్ చేశారు. ఆయన మాటల ప్రకారం 8 విషయాల్లో మోదీ విజయం సాధించారు. ఫారిన్ పాలసీ: దేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఇండియాపై గౌరవం పెరిగింది. 12 నెలల కాలంలో 18 దేశాలు తిరిగి ప్రపంచ నేతలను కలిశారు. అందువల్ల ప్రపంచ చిత్రపటంపై భారత ఖ్యాతి మరింతగా పెరిగింది. ప్రభుత్వ పనితీరు: విద్యుత్, బొగ్గు, గనులు తదితర రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు పారదర్శకంగా సాగి సంస్కరణల అమలుపై నిబద్ధతను చాటాయి. గత ప్రభుత్వాల సమయంలో ఏర్పడ్డ అపఖ్యాతి మెల్లిమెల్లిగా పోతోంది. పూర్తి స్పష్టతతో ఎన్డీయే సర్కారు ముందుకు సాగుతోంది. పన్ను విధానం: ఇండియాలో పన్నుల విధానం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న విధానానికి అనుగుణంగా మార్చాలన్న అడుగులు పడ్డాయి. ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలి. పన్ను రాయితీలు తొలగాల్సి వుంది. ఏప్రిల్ లో జరిగే రాజ్యసభ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నాము. పరిపాలన, ఫెడరలిజం: అవినీతి రహిత పరిపాలన దిశగా కీలక అడుగులు వేశాము. వ్యవస్థలో సమాఖ్యతత్వాన్ని బలోపేతం చేశాము. 'నీతి ఆయోగ్' ఏర్పాటు కీలకమైన ముందడుగు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా దవ్య లోటు, కరెంటు ఖాతాల లోటు, వృద్ధి రేటు, రెవెన్యూ గణాంకాలు స్థిరపడ్డాయి. మరింత క్వాలిటీ కోసం సహకారతత్వానికి ప్రోత్సాహమిస్తున్నాం. నల్లధనం, అధికార దుర్వినియోగం: విచారణ సంఘాలను ప్రభావితం చేయడమన్నది గత మాట. నల్ల ధనాన్ని నిలువరించే దిశగా రాబోయే సంవత్సరంలో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయి. మౌలిక వసతులు: గతంలో ఆగిపోయిన 16 ప్రాజెక్టుల విషయంలో వచ్చే సంవత్సరం పనులు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ రంగం, గ్రామీణ మౌలిక వసతుల విభాగాల్లో పెట్టుబడులు పెంచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బ్యాంకింగ్, బీమా: ప్రపంచ ఆర్థిక మాంద్యంతో బ్యాంకింగ్ రంగం ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ, కార్యనిర్వహణాధికారులు, బోర్డు సభ్యుల నియామకం హుందాగా సాగుతున్నాయి. ప్రభుత్వం ప్రారంభించిన బీమా పథకాలు వారాల వ్యవధిలో 7.5 కోట్ల మందికి చేరాయి. ఇవన్నీ సామాన్యులకు బీమా ప్రయోజనాలను దగ్గర చేసేవే. పొదుపు: ఇండియా ఒక పింఛను రహిత సమాజం. అత్యధికులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందడం లేదు. గత సంవత్సర కాలంలో చేసిన ప్రయత్నాల వల్ల 11 శాతం మందికి పింఛను అందే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయే ప్రారంభించిన ముద్రా బ్యాంకు రూ. 5.7 కోట్ల చిన్న ఔత్సాహికులకు ఆర్థిక సహాయం అందించనుంది.

  • Loading...

More Telugu News