: బాబు మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించని ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ దఫా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు వర్గాలకు చెందిన వారెవరూ విజయం సాధించలేదు. శాసనమండలి ఎన్నికల వేళ ఆ లోటును భర్తీ చేసుకున్న బాబు, వారిని మంత్రులుగా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మరికొందరు సీనియర్లను తీసుకోవచ్చనే ప్రచారమూ జరుగుతోంది. ప్రస్తుతం బాబు మరో ఆరుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. కాగా, ఎమ్మెల్సీగా ఖరారైన షరీఫ్ కు ఈ విస్తరణలో తప్పనిసరిగా ఓ బెర్తు దక్కినట్టేనని అంచనా. మహిళా కోటాలో ఎస్టీ నేత సంధ్యారాణి పేరు కూడా వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, పతివాడ నారాయణస్వామి నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్, పార్థసారథి తదితరుల పేర్లపై బాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.