: ఇన్ఫోసిస్ లో సీఈఓ విశాల్ శిక్కా కన్నా ఆ ఉద్యోగులకే వేతనం అధికం!
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి వెల్లడించిన ఫైలింగ్ లో ఐటీ సేవల అగ్రగామి ఇన్ఫోసిస్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొంది. సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న విశాల్ శిక్కా కన్నా అధిక వేతనం తీసుకుంటున్న వారు ఉన్నారు. సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న యూబీ ప్రవీణ్ రావు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ బన్సాల్ ల వేతనం శిక్కా కన్నా అధికంగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో విశాల్ రూ. 4.3 కోట్ల వేతనాన్ని పొందగా, ప్రవీణ్ రావుకు రూ. 5.82 కోట్లు, రాజీవ్ బన్సాల్ కు రూ. 4.5 కోట్లు వేతన రూపంలో అందింది. ప్రవీణ్ రావు వేతనంలో సుమారు రూ. 60 లక్షలు బేసిక్ కాగా, బోనస్, ఇన్సెంటివ్ ల రూపంలో రూ. 3.7 కోట్లు, వార్షిక కమీషన్ రూపంలో రూ. 1.4 కోట్లు లభించాయి.