: నేడు కాళేశ్వరి వంతు... లారీతో ఢీ
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిన్న కేసినేని ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డ ఘటన మరువకముందే, నేడు కాళేశ్వరి ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ప్రకాశం జిల్లా కొమురోలు మండలం కత్తెరవానిపల్లె సమీపంలో జరిగిన ప్రమాదంలో విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో పదిమందికి పైగా గాయపడ్డారు. వీరిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా కడప జిల్లా వాసులుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.