: టూ వీలర్ ఇంజనుతో హెలికాప్టర్: మావోయిస్టు పత్రాల్లో పరిజ్ఞానం!
కేరళ, బీహార్ మావోయిస్టుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు పత్రాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇద్దరు కూర్చునేలా హెలికాప్టర్లను తయారు చేయడంపై మావోయిస్టులు దృష్టిని సారించారు. దీంతో పాటు రిమోట్ సాయంతో నడిపే చిన్న చిన్న డ్రోన్లను తయారు చేసి వాటి సాయంతో బాంబుల దాడులు జరపాలని మావోలు భావిస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సాంకేతికత నిమిత్తం పూర్తి సమాచారం సేకరించారు. ఓ సంస్థకు చెందిన ద్విచక్ర వాహనం ఇంజన్ సాయంతో నిర్మించేలా సిద్ధం చేసిన హెలికాప్టర్ డిజైన్, బీహార్ లోని గయ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులకు లభించింది. మందుపాతరలను వీడి రిమోట్ సాయంతో పనిచేసే బాంబులు, డ్రోన్ల తయారీ పరిజ్ఞానం గురించి కేరళ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్న ఐదుగురు మావోల డైరీలో లభించింది. ప్రస్తుతం పోలీసులు వీటిని మరింతగా విశ్లేషించే పనిలో పడ్డారు.