: మోదీ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది: నితిన్ గడ్కరీ
చైనా, కొరియా, మంగోలియా దేశాల్లో పర్యటించిన సందర్భంలో భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్ లో అవినీతి పెరిగిపోవడం, ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు లేకపోవడంతో... ఒకప్పుడు తమ దేశ ప్రజలు బాధపడేవారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. విదేశాల్లో భారత్ ప్రతిష్టను మోదీ దిగజార్చారని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పందించారు. దేశాన్ని అవమానించేలా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రధాని తమతో చెప్పారని అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను తాము సరిదిద్దుతున్నామన్న క్రమంలో మోదీ చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తెలిపారు. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.