: అలిగిన అరికెల నర్సారెడ్డి... టీడీపీకి రాజీనామా చేసే యోచన
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు కాకుండా పార్టీ నేత వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అలకబూనారు. తెలంగాణలో ఎమ్మెల్సీలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేశానని సన్నిహితులతో గుర్తు చేసుకున్నారు. తన పోరాటాన్ని పార్టీ అధినేత చంద్రబాబు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న తన అనుచరులతో మధ్యాహ్నం నర్సారెడ్డి సమావేశమై పార్టీని వీడాలనే ఆలోచనను వెలిబుచ్చారట. అంతేగాక నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని కూడా అరికెల భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన నిజామాబాద్ జిల్లా మినీ మహానాడు రద్దయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.