: టెర్రస్ పై నుంచి పడి బీహార్ లో మాజీ ఎమ్మెల్యే మృతి
బీహార్ లో ఓ మాజీ ఎమ్మెల్యే దుర్మరణం పాలయ్యారు. మగన్ ఇన్సాన్ (84) అనే ఈ మాజీ శాసనసభ్యుడు టెర్రస్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు విడిచారు. కథియార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ దుర్ఘటన వివరాలను ఆయన కుమారుడు దినేశ్ మీడియాకు తెలిపారు. మగన్ టెర్రస్ పై మార్నింగ్ వాక్ పూర్తి చేసుకున్న అనంతరం, కిందికి వచ్చే క్రమంలో మెట్లు దిగుతుండగా, బ్యాలన్స్ తప్పడంతో కిందపడిపోయారని వివరించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని, అయితే, పై నుంచి పడిపోవడంతో షాక్ కు గురయ్యారని, దాంతో హార్ట్ అటాక్ వచ్చిందని, అందుకే చనిపోయారని వైద్యులు తెలిపినట్టు దినేశ్ వెల్లడించారు. మగన్ 1980లో తొలిసారి కడ్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం, ప్రాణ్ పూర్ నియోజకవర్గం నుంచి 1985లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు.