: ఇండియాలో సిద్ధమైన తొలి రోడ్ రన్ వే... విజయవంతంగా దిగిన యుద్ధ విమానం
అత్యవసర సమయంలో విమానాలు దిగేందుకు రన్ వే దొరకని పరిస్థితుల్లో జాతీయ రహదారులపై యుద్ధ విమానాలు దిగేలా భారత వాయుసేన నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. యమునా ఎక్స్ ప్రెస్ వేపై మధుర వద్ద ఈ ఉదయం మిరేజ్ 2000 ఫైటర్ జెట్ విమానం ల్యాండ్ అయింది. ప్రయోగం కోసమే విమానాన్ని ల్యాండింగ్ చేశామని అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం జర్మనీ, పోలాండ్, స్వీడన్, సౌత్ కొరియా, తైవాన్, ఫిన్ ల్యాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, చకోస్లోవేకియా, పాకిస్థాన్ దేశాల్లో అత్యవసర సమయంలో జాతీయ రహదారులపై విమానాల ల్యాండింగునకు చట్టబద్ధమైన అనుమతులున్నాయి. భవిష్యత్తులో ఆగ్రా, లక్నోల మధ్య ఉన్న విశాలమైన రహదారి వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడుతుందని అధికారులు వ్యాఖ్యానించారు.