: అందుబాటులోకి రానున్న ‘నిత్య యవ్వన’ మాత్ర!
మరణంలేని జీవితం, నిత్య యవ్వనం... పాత జానపద చిత్రాలను చూస్తే, ఏదైనా కోరిక కోరుకోమన్నప్పుడు ఈ రెండూ వినిపిస్తుంటాయి. ఎన్నో శతాబ్దాలుగా నిత్య యవ్వనం కోసం ఎంతోమంది విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కాగా, మరో ఐదేళ్లలో నిత్య యవ్వనాన్ని పొందే మాత్రలను అందుబాటులోకి తెస్తామని బర్మింగ్ హామ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం ఓ మందును తయారు చేస్తున్నామని వివరించారు. వయసుతో పాటు వచ్చే మార్పులకు కారణమయ్యే ఓ ఎంజైమును గుర్తించామని, దీన్ని అడ్డుకోవడం కోసం ప్రయోగాలు చేస్తున్నామని తెలిపారు. '11 బీటా-హెచ్‌ఎస్‌డీ1'గా వ్యవహరిస్తున్న ఈ ఎంజైమ్ కార్టిసాల్ అనే స్టెరాయిడ్ హార్మోన్ ను ఆక్టివేట్ చేస్తూ, వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల శక్తిని బలహీనంగా మార్చుతోందన్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రయోగాలు సఫలమైతే నిత్య యవ్వనం సాధ్యమేనని ధీమాగా చెబుతున్నారు.