: అమెరికా రహస్య ప్రయోగాలు... అంతరిక్షం నుంచి అణుబాంబుల కోసమేనా?
అమెరికా సైనిక విభాగం అంతరిక్షంలో రహస్య పరీక్షలు కొనసాగిస్తోంది. మానవ రహిత స్పేస్ షటిల్ ఎక్స్-37బీని నాలుగోసారి ప్రయోగించింది. ఇందులో ఏం పంపారన్న విషయం ప్రపంచానికి తెలియదు. విదేశీ శాటిలైట్లను కూల్చేందుకు దీనిని వినియోగిస్తున్నారని, ఇది అంతరిక్షం నుంచి బాంబులు వేయగలదని కొందరు వాదిస్తున్నారు. అయితే, దీనికి ఎటువంటి ఆధారాలూ లేవని నిపుణులు వ్యాఖ్యానించారు. వెళ్లేటప్పుడు రాకెట్ మాదిరి దూసుకెళ్లే ఈ అంతరిక్ష విమానం వచ్చేటప్పుడు మాత్రం సాధారణ విమానం మాదిరిగా భూమిపై దిగుతుంది. కాగా, దీని పొడవు 29 అడుగులు. ఎత్తు 9.6 అడుగులు. బరువు 5,000 కిలోలు. డ్రోన్‌ల తరహాలో దీనిని పూర్తిగా కంప్యూటర్ల ద్వారా నియంత్రిస్తారు. అంతరిక్షంలో 177 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల మధ్య ఇది తిరుగుతూ ఉంటుంది.