: పేడే కదా అని తీసిపారేయొద్దు... బస్సు వేగం పెంచింది
పేడే కదా అని తేలిగ్గా తీసిపారేసే రోజులు పూర్తిగా పోయాయి. సాంకేతిక అభివృద్ధితో పేడను ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వున్నారు. వంట గ్యాస్, విద్యుత్, ఇలా పలు అవసరాలకు పేడను ఇంధనంగా వినియోగిస్తున్నారు. తాజాగా, పేడను ఇంధనంగా మార్చుకుని బస్సును అత్యంత వేగంతో నడిపి గిన్నిస్ రికార్డులకు ప్రయత్నించిన ఘటన లండన్ లో చోటుచేసుకుంది. బెడ్ ఫోర్డ్స్ లోని మిల్ బ్రూక్ గ్రౌండ్స్ లో పేడను ఇంధనంగా వినియోగించి ఓ బస్సు గంటకు 123.57 కిలో మీటర్ల వేగంతో నడిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. బస్సు పైకప్పుపై ఏర్పాటు చేసిన ఏడు ట్యాంకుల్లో పేడను నింపుతారు. పేడ కారణంగా ఆ ట్యాంకుల్లో జనించే బయోమీథేన్ గ్యాస్ ఆధారంగా ఈ బస్సు నడుస్తుంది. బస్సులో సాంకేతిక మార్పులతో వేగం పెంచి 250 కిలోమీటర్ల వేగం అందుకుని రికార్డు నమోదు చేస్తామని తయారీ దారులు వెల్లడించారు. పేడవాసన ప్రయాణికులకు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ బస్సులు విరివిగా అందుబాటులోకి వస్తే, మన దేశంలో ఇంధనానికి కొరత అనేదే ఉండదు.