: ఢిల్లీ చిన్నారి అత్యాచార సంఘటనపై బాలీవుడ్ స్పందన
ఐదేళ్ల చిన్నారిపై అతి కర్కశంగా లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనను బాలీవుడ్ నటీనటులు ముక్తకంఠంతో ఖండించారు. దీనిని అతి ఘోర, పైశాచిక ఘటనగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ప్రజలకు అప్పగించాలని కోరారు.
శిల్పాశెట్టి మాట్లాడుతూ.. బాధిత చిన్నారి తరఫున న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న యువతిపై ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబట్టారు. దేశం ఎటువెళుతోందని ప్రశ్నించారు. ''దీనికి ముగింపు ఎప్పుడు? ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి నేరస్థులపై కఠిన చర్యలను వెంటనే తీసుకోవాలి'' అని శిల్పా అన్నారు.
ఈ ఘటన షాకింగ్ గా దర్శకుడు కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలు మాటలకందనివిగా చెప్పారు. మనది అనాగరిక సమాజమా? నైతికత నిలిచే ఉందా? అని ప్రశ్నించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీదేవి కోరారు. మన సమాజం ఎలా మారుతోంది? బాధిత చిన్నారి త్వరగా కోలుకోవాలని రితేష్ దేశ్ ముఖ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.