: మ్యాగీ నూడుల్స్ ప్రమాదకరమని తేలిందన్న యూపీ సర్కారు, సురక్షితమన్న 'నెస్లే'
రెండు నిమిషాల్లో సిద్ధమైపోయే రుచికరమైన స్నాక్, టిఫిన్, లంచ్ ఐటమ్ గా పాప్యులర్ అయిన మ్యాగీ నూడల్స్ ప్రమాదకరమని ఉత్తరప్రదేశ్ సర్కారు అంటోంది. ఇందులో మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్ జీ) ప్రమాదకర స్థాయిలో ఉందని తమ పరీక్షల్లో తేలినట్టు తెలిపింది. లక్నోలో కొన్ని శాంపుల్స్ తీసుకున్న ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వాటిని కోల్ కతాకు పంపించగా, పరిమితులకు మించి ఎంఎస్ జీ ఉందని నివేదిక వచ్చింది. వాస్తవానికి ఎంఎస్ జీని చైనా వంటకాల్లో మరింత రుచి కోసం వినియోగిస్తారు. తగినంత పరిమాణంలో వినియోగిస్తే ఎంత రుచిని పెంచుతుందో మోతాదు ఎక్కువైతే అన్ని అనర్ధాలనూ కలిగిస్తుంది. ఎంఎస్ జీ ఎక్కువైతే, తలనొప్పి, చమటలు పట్టడం, మెడ, ముఖం తదితర భాగాలపై మంటలు పుట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నరాల వ్యవస్థను నాశనం చేస్తుంది కూడా. పరీక్షించిన మ్యాగీలో పరిమితులకు మించి ఎన్నో రెట్లు 'లెడ్' ఉన్నట్టు కూడా నివేదిక వెల్లడించింది. 0.01 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) వరకూ మాత్రమే ఉండాల్సిన లెడ్ 17 పీపీఎంగా ఉందని వివరించింది. కాగా, తాము మ్యాగీలో ఎంఎస్ జీని కలపడం లేదని నెస్లే స్పష్టం చేసింది. తాము వాడే కొన్ని పదార్థాలలో సహజంగానే గ్లుటమేట్ ఉంటుందని, దాన్ని ఎంఎస్ జీగా అపార్థం చేసుకుంటున్నారని వెల్లడించింది. మ్యాగీ అత్యంత సురక్షితమని తెలిపింది.