: బంగారానికి వడ్డీగా బంగారం


బంగారం ఇళ్లలో ఉంటే నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. బ్యాంకు లాకర్లో ఉంటే కాస్త సంతోషంగా ఉండచ్చు. కానీ, ఒక్క రూపాయి లాభం లేకపోగా, లాకర్ల నిర్వహణకు డబ్బులు కడుతూ ఉండాలి. అదే బ్యాంకులో బంగారాన్ని డిపాజిట్ చేసి దానికి వడ్డీ రూపంలో నగదును లేదా బంగారాన్ని పొందితే... అదే 'గోల్డ్ మానిటైజేషన్' పథకం. మోదీ సర్కారు ప్రజలకు పరిచయం చేసిన కొత్త స్కీం. ఈ పథకం కింద బ్యాంకుల్లో కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేస్తే, వడ్డీ కింద అదనపు బంగారం లేదా నగదు లభిస్తుంది. కనీసం సంవత్సరం కాల వ్యవధికి డిపాజిట్ చేయాలి. వచ్చే వడ్డీపై పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. వృథాగా ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగించే ఆలోచనతో పాటు, బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో పాటు కరెంటు ఖాతాలోటుకు పరిష్కార మార్గంగా ఈ పథకాన్ని కేంద్రం భావిస్తోంది. ప్రజలు ఎవరైనా 100 గ్రాముల బంగారాన్ని తాకట్టుపెట్టి 4 శాతం వడ్డీని పొందితే, సంవత్సరం తరువాత 104 గ్రాముల బంగారం లభిస్తుంది. ఆ సమయంలో ధరతో సంబంధం ఉండదు. డిపాజిట్లను స్వీకరించే బ్యాంకులు తాము ఎంత వడ్డీ ఇవ్వాలన్న విషయాన్ని స్వయంగా నిర్ణయించుకుంటాయి. ఈ పథకంపై ముసాయిదా నిబంధనలను విడుదల చేసిన కేంద్రం వచ్చే నెల 2 లోగా ప్రజలు తమ తమ అభిప్రాయాలు తెలపాలని సూచించింది. కాగా, ఎంపిక చేసిన నగరాల్లో గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని అమలు చేస్తామని గత సంవత్సరం బడ్జెట్లో అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, బంగారు ఆభరణాలను డిపాజిట్ చేస్తే తిరిగి అదే రూపంలో మన చేతికి తిరిగి రాకపోవడం ఈ పథకంలో ఉన్న ప్రధాన లోపం. సెంటిమెంట్ కు ఎంతో విలువ ఇచ్చే ఇండియాలో, ఈ స్కీమ్ ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News