: లక్ష్యఛేదనలో బోల్తా పడ్డ చెన్నై... ఫైనల్ చేరిన రోహిత్ సేన


లక్ష్యఛేదనలో మెరుగైన రికార్డున్న మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్-8 ప్లే ఆఫ్ లో బోల్తా పడ్డాడు. అతడి నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిన్న రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అంత పెద్దదేమీ కాని లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. దీంతో టైటిల్ వేటలో అడుగు దూరంలో ఇంటి బాట పట్టింది. ఇక బ్యాటింగ్ లోనే కాక బౌలింగ్ లోనూ సత్తా చాటిన ముంబై ఇండియన్స్ నేరుగా ఫైనల్ చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (65), పార్థీవ్ పటేల్ (35) ముంబైకి శుభారంభాన్నివ్వగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (19) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కీరన్ పొలార్డ్ (41) మెరుపులు మెరిపించాడు. కేవలం 17 బంతుల్లో ఓ ఫోర్, ఐదు సిక్స్ లతో 41 పరుగులు చేశాడు. అంబటి రాయుడు (10) విఫలమయ్యాడు. వెరసి నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి లసిత్ మలింగ ఆదిలోనే షాకిచ్చాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ డ్వేనీ స్మిత్ (0) డకౌట్ కావడంతో చెన్నై ఒత్తిడిలో పడిపోయింది. మరో ఓపెనర్ మైక్ హస్సీ (16) కూడా పెద్దగా రాణించలేకపోయాడు. డూప్లెసిస్ (45), సురేశ్ రైనా (25) రాణించి విజయంపై ఆశలు రేపారు. కెప్టెన్ ధోనీ(0)ని స్పిన్నర్ హర్భజన్ సింగ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత డ్వేనీ బ్రేవో(20), రవీంద్ర జడేజా (19), రవిచంద్రన్ అశ్విన్ (23)లు పోరాడినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేని చెన్నై, 19 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో 25 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించిన ముంబై ఫైనల్ కు అర్హత సాధించగా, చెన్నై ఇంటిబాట పట్టింది.

  • Loading...

More Telugu News