: కోహ్లీ అంటే బీసీసీఐకి ఎంత ముద్దో!
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి ప్రియురాలు అనుష్క శర్మతో ముచ్చట్లాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ కరుణ చూపింది. ఈ వ్యవహారంలో కోహ్లీకి తాము నోటీసులు జారీ చేయలేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అనుష్కతో మాట్లాడడం పెద్ద విషయమేం కాదని కొట్టిపారేశారు. అందులో నోటీసులు జారీ చేయాల్సినంత తప్పేమీ కనిపించడం లేదని అన్నారు. ఈ ఘటనపై తమకు యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) నుంచి ఎలాంటి సమాచారం అందలేదని వివరించారు. అనుష్క... కోహ్లీని కలవడం వెనుక ఏదైనా అవినీతికి సంబంధించిన విషయం ఉందని భావించి ఉంటే ఏసీబీ తమకు సమాచారం అందించి ఉండేదని శుక్లా తెలిపారు. దీనిపై ఏసీబీ... బీసీసీఐకి ఎలాంటి నివేదిక ఇవ్వనప్పుడు, కోహ్లీకి తామెందుకు నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అయినా, అనుష్క బయటి వ్యక్తేం కాదంటూనే, ఆమె అలాంటి పరిస్థితి రాకుండా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే, ఆటగాళ్లు ప్రోటోకాల్ ను పాటించాలని తాను సూచిస్తానని పేర్కొన్నారు.