: ఆరేళ్ల తరువాత క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్ చేరిన విదేశీ జట్టు
ఉపఖండంలోని క్రీడాభిమానులకు అత్యంత ప్రీతి పాత్రమైన ఆట క్రికెట్. పాకిస్థానీలను క్రికెట్ కు వీరాభిమానులుగా పేర్కొంటారు. ఎందుకంటే, పాక్ జట్టు ఓటమిపాలైతే తీవ్రనిరసన ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే ఓటమి భారత్ తో అయితే ఆటగాళ్లు స్వదేశంలో అడుగుపెట్టేందుకు కూడా సాహసించరు. అంతటి వీరాభిమానం పాకిస్థానీలది. అయితే ఆరేళ్ల క్రితం అంటే 2009 మార్చి 3న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టుతో ఆడేందుకు వెళ్తున్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై తుపాకులతో తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగనప్పటికీ, ఆటగాళ్లు, అంపైర్లు బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. దీనిపై కన్నెర్రజేసిన ఐసీసీ పాక్ లో మ్యాచ్ లపై నిషేధం విధించింది. ఈ దుర్ఘటన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు కష్టకాలం తెచ్చిపెట్టింది. పాక్ లో ఆడేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. కొన్ని జట్లు ఆడేందుకు అంగీకరించినా తటస్థ వేదికపై మ్యాచ్ లు నిర్వహించాలని కోరాయి. దీంతో పలు సిరీస్ లు యూఏఈ వేదికగా పాక్ నిర్వహించింది. అయితే నిధుల్లో సగం యూఏఈకి పోతుండడంతో పీసీబీని ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలతో పాక్ లో మ్యాచ్ లు నిర్వహించాలని ప్రయత్నించి విఫలమైంది. ఎట్టకేలకు జింబాబ్వే జట్టు పాకిస్థాన్ లో రెండు టీట్వంటీలు, మూడు వన్డేలు ఆడేందుకు అంగీకరించింది. ఈ నేపధ్యంలో మొన్న ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 45 మందిని పొట్టనబెట్టుకోవడంతో జింబాబ్వే పునరాలోచనలో పడింది. అయితే, పీసీబీ చొరవతో జింబాబ్వే ఆటగాళ్లు ఈ రోజు లాహోర్ లో అడుగుపెట్టారు. ఈ నేపధ్యంలో పీసీబీ జింబాబ్వే క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. విమానాశ్రయం నుంచి స్టార్ హోటల్ వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆరేళ్ల తరువాత లైవ్ మ్యాచ్ లు చూసే అవకాశం లభిస్తుండడంతో పాక్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నప్పటికీ, సిరీస్ సక్రమంగా జరుగుతుందా? అనే అనుమానం అందర్లోనూ నెలకొంది.