: 'రోహిణి'ని తలచుకుని భయపడుతున్న ప్రజలు!
'రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి' అన్నది నానుడి. కానీ ఈ సంవత్సరం రోహిణీ కార్తె రాకముందే ఎండలు రికార్డు స్థాయిని తాకాయి. మంగళవారం నాడు పలు ప్రాంతాల్లో ఈ సీజన్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. తెలుగు రాష్టాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. నేడు నిజామాబాద్ లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 44, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో 42, హైదరాబాద్, మెదక్ లలో 41, కడప, కర్నూలు నగరాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడే ఇలా వుంటే రోహిణీ కార్తె వచ్చిన తరువాత ఎండలు ఇంకెంత ముదురుతాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.