: యూపీ నేత బెంజ్ కారు పైకి ఎక్కి నిరసన తెలిపిన ఆగ్రా యువతి!
ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత అభినవ్ శర్మ సెక్యూరిటీ గార్డులు తనను వేధించారని ఆరోపిస్తూ, ఆగ్రా అక్కాచెల్లెళ్లు హల్ చల్ చేశారు. రోడ్డుపై ఆయన బెంజ్ కారును ఆపి బాయినెట్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజును తెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే, సాధ్వీ పాండే అనే యువతి తన సోదరితో కలసి ఓ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో అభినవ్ శర్మ బాడీ గార్డులు ఆమెకు కన్నుకొట్టారు. వారి ఫోటోలు తీయబోగా, సెల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ధైర్యంగా బండి దిగి కారు ఎక్కి నిరసన తెలిపింది. కారు ముందున్న సమాజ్ వాదీ పార్టీ జెండాను ఊడబెరికి దాంతోనే కారు అద్దాలు పగులగొట్టింది. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్నవారు సైతం ఆమెకు మద్దతు తెలపడంతో చేసేదేమీ లేక క్షమాపణ చెప్పి పరిహారంగా రూ. 6,500 ఇచ్చి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆ సమయంలో వాహనంలో అభినవ్ శర్మ ఉన్నారా? అన్న విషయంపై స్పష్టత రాలేదు.