: అంగలూరులో ఉద్రిక్తత... పోలవరం పనులను అడ్డుకుంటున్న నిర్వాసితులు, పోలీసులతో వాగ్వాదం
తూర్పుగోదావరి జిల్లా అంగలూరులో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం పనులను చేపట్టేందుకు వచ్చిన అధికారులను నిర్వాసితులు అడ్డుకున్నారు. గ్రామస్తుల వ్యతిరేకతను ముందే పసిగట్టిన అధికారులు పోలీసు బందోబస్తుతో అక్కడికి చేరుకున్నారు. ప్రాజెక్టుకు గతంలో సరేనన్న గ్రామస్తులు ముందుగా గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. అయితే పరిహారం, పునరావాసం పూర్తయితే తప్పించి, అక్కడి నుంచి కదిలేది లేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు బలవంతంగా ఇళ్లను కూల్చేసే యత్నం చేశారు. దీంతో పోలీసులను అడ్డుకున్న ఓ మహిళ గుండెపోటుకు గురైంది. వెనువెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గ్రామంలోని మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.