: ఇక చిల్లర దుకాణాల్లోనూ బీరు బాటిళ్లు... ఏఐబీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నలే ఆలస్యం
ఆలిండియా బ్రూవర్స్ అసోసియేషన్ (ఏఐబీఏ) ప్రతిపాదనలకు రాష్ట్రాలు ఓకే అనడమే తరువాయి, బీరు బాటిళ్లు మన బడ్డీ కొట్లలోకి వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసలు బీరును సాధారణ మద్యంలా పరిగణించడమే అసలు సమస్యకు కారణమని ఏఐబీఏ డైరెక్టర్ జనరల్ సోబన్ రాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మద్యంలో 42 శాతం ఆల్కహాల్ ఉంటే, బీరులో కేవలం 5 నుంచి 8 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఇకనైనా వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని బీరును వేగంగా విక్రయమయ్యే వినియోగ వస్తువు (ఎఫ్ఎంసీజీ) కేటగిరీ కింద చేర్చాలని ఆయన వాదిస్తున్నారు. ఈ మేరకు ఓ సరికొత్త ప్రతిపాదనను దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. రాయ్ ప్రతిపాదనలకు రాష్ట్రాలు ఓకేనంటే, వెనువెంటనే బీరు బాటిళ్లు, మన బడ్డీ కొట్లలోకి వచ్చిపడటం ఖాయం. ఇదిలా ఉంటే, బీరుపై ఏపీతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం నుంచి 85 శాతం మేర పన్నేస్తున్నాయని రాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.