: మేడెక్కిన దున్నపోతు... దించేందుకు అధికారుల నానాతంటాలు!
ఓ దున్నపోతు దర్జాగా మేడెక్కేసింది. ఎక్కడమైతే ఎక్కింది కానీ, ఎలా కిందకు దిగాలో అర్థం కాక చిక్కుకుపోయింది. నానాయాగీ చేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని చురు జిల్లాలో జరిగింది. ఓ పాఠశాల భవంతి గేటు తలుపులు తీసి ఉండడంతో దున్నపోతు లోపలికి ప్రవేశించి మెట్లెక్కేసింది. పైకెళ్లిన తరువాత కిందకు దిగలేకపోయింది. స్థానికులు, పాఠశాల యాజమాన్యం ఎంతగా ప్రయత్నించినా దాన్ని కిందకు దించలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారూ ఏమీ చేయలేకపోయారు. ఆపై విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అర్చనా సింగ్ స్పందించి అధికారులను, పశు వైద్యులను అక్కడికి పంపారు. వారు చాలా సేపు శ్రమించి అతి కష్టం మీద దున్నను సురక్షితంగా కిందకు దించగలిగారు. ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్ లో ఎవరూ లేరట.