: కానిస్టేబుల్ పై గులాబీ నేత గూండాగిరీ!...డీజిల్ పోసి తగులబెడతానంటూ బెదిరింపు


అధికారంలో వున్న తమ నేతలను చూసుకుని వారి అనుచరులు ఆగడాలకు దిగడం మనం చూస్తూనే వుంటాం. నిన్న వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక శివారులో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ‘‘డీజిల్ తీసుకురండి. కానిస్టేబుల్ ను తగులబెడదాం. తమాషా చేస్తున్నాడా? నేను స్పీకర్ అనుచరుడినని తెలిసి కూడా పోలీసులకు ఇక్కడికి వచ్చే దమ్ముందా?’’ అంటూ గులాబీ పార్టీకి చెందిన ఓ చోటామోటా నేత చేసిన వీరంగంతో వరంగల్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఒకరు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. వివరాల్లోకెళితే, పత్తిపాక శివారులో ఎస్వీసీ క్వారీ వెనుక గుట్ట మహిపాల్ రెడ్డికి కొంత భూమి ఉంది. క్వారీలో బ్లాస్టింగ్ ల కారణంగా మహిపాల్ రెడ్డి పొలంలో రాళ్లు పడుతున్నాయి. దీంతో తనకు పరిహారం ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ నేత పోలేపల్లి శ్రీనివాసరెడ్డిని తీసుకుని మహిపాల్ రెడ్డి క్వారీ యాజమాన్యంతో వాదులాటకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారుల ఆదేశాలతో కానిస్టేబుల్ శ్రీనివాస్ తో పాటు సీఐ గన్ మన్ కుమారస్వామి అక్కడికి వెళ్లారు. వీరిని చూడగానే శ్రీనివాసరెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెనువెంటనే పక్కనే ఉన్న ఇనుప రాడ్ తీసుకుని కానిస్టేబుల్ పై దాడి చేసేందుకు యత్నించాడు. దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కానిస్టేబుల్ అక్కడినుంచి జారుకున్నాడు. అనంతరం స్టేషన్ కు చేరుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News