: బాలీవుడ్ నటి శిఖా జోషి ఆత్మహత్య
మరో బాలీవుడ్ నటి అర్థాంతరంగా తనువు చాలించింది. 2013లో థియేటర్లను తాకిన 'బీఏ పాస్' చిత్రం హీరోయిన్ శిఖా జోషి (40) ముంబై వెర్సోవా ప్రాంతంలోని తన అపార్ట్ మెంటులో కంఠం తెగిన స్థితిలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోషి తన స్నేహితురాలితో కలిసి 'మధా' ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. ఆమె బాత్ రూంలోకి వెళ్లి పదునైన ఆయుధంతో తన గొంతును కోసుకుంది. ఎంత సేపటికీ ఆమె బాత్ రూం నుంచి రాకపోయేసరికి ఆమె స్నేహితురాలు తలుపు కొట్టగా, డోర్ ను తీసిన జోషి ఆ వెంటనే కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం సమీపంలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే జోషి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కాగా, ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవడం, లైంగిక వేధింపులు జరగడంతో ఆమె నిరాశలో ఉందని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.