: 'వార్ రూమ్'ను 'వాష్ రూమ్'గా మార్చిన కేసీఆర్: పోరాటానికి సిద్ధమంటున్న ఉద్యోగ నేతలు
తెలంగాణ ఉద్యోగ సంఘాలు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల సమావేశంలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రైతుల కోసం రాహుల్ వచ్చినట్టు... ఉద్యోగుల కోసం కూడా రాహుల్ రావాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని ఓ నేత చేసిన వ్యాఖ్య వేడి పుట్టించింది. ఉద్యమ సమయంలో ఉద్యోగుల కోసం టీఆర్ఎస్ కార్యాలయంలో వార్ రూమ్ ను ఏర్పాటు చేశారని... కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, దాన్ని వాష్ రూమ్ గా మార్చేశారని మరో నేత అన్నారు. అధికారంలోకి రాక ముందు ఉద్యోగులతో సరైన రీతిలో వ్యవహరించిన కేసీఆర్... సీఎం కాగానే ఉద్యోగులను విస్మరిస్తున్నారని మరో నేత మండిపడ్డారు. గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ తో కలసి ఉద్యమించామని... ఇప్పుడు ఉద్యోగుల సమస్యల సాధన కోసం అదే కేసీఆర్ తో పోరాటానికి సైతం సిద్ధమని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిద్రపోతే... ఉద్యోగులు తిరుగుబాటు చేసే పరిస్థితి తలెత్తవచ్చని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేవే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.