: సియోల్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ... కిక్కిరిసిన సమావేశ ప్రాంగణం
రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈ ఉదయం ఆ దేశ రాజధాని సియోల్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అక్కడ అడుగుపెట్టిన వెంటనే ఆయన బిజీ అయిపోయారు. తొలుత, సియోల్ లో సుమారు 1500 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పర్యటనలో మీతో మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ లో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని... ప్రపంచ పటంలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. భారత్ యాక్టివ్ గా లేకపోవడంతో 'బ్రిక్స్' కూటమి అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతోందనే అపవాదు గతంలో ఉండేదని... ప్రస్తుతం భారత్ బలోపేతమయిందని... భారత్ లేని బ్రిక్స్ కూటమి అసంపూర్తిగా ఉంటుందని... కనీసం దాన్ని ఊహించుకోలేమని చెప్పారు. బంగ్లాదేశ్ తో ఉన్న సరిహద్దు సమస్యను ఒక్క ఏడాదిలోనే పరిష్కరించామని తెలిపారు. 'సార్క్'ను బలోపేతం చేయడానికి భారత్ కృషి చేస్తోందని మోదీ చెప్పారు. ఇటీవల యెమెన్ లో చిక్కుకుపోయిన ఎంతో మంది పాకిస్థానీలను భారత్ రక్షించిందని... అలాగే 11 మంది భారతీయులను పాక్ రక్షించడమే కాక, ప్రత్యేక విమానంలో వారిని తీసుకొచ్చిందని తెలిపారు. అన్ని దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటూ... అభివృద్ధి పథంలోకి దూసుకుపోవడమే భారత ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశ పునర్నిర్మాణంలో కొరియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ప్రసంగానికి ఎన్నారైల నుంచి మంచి స్పందన లభించింది.