: ప్రాణాలు కాపాడిన వాడే ప్రపోజ్ చేశాడు!
అమెరికాలో మెలిస్సా డోహ్మే అనే యువతి జీవితంలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకున్నాయి. ప్రేమాయణం బెడిసికొట్టగా, నమ్మినవాడే రాక్షసుడయ్యాడు. ఆమెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచాడు. 32 కత్తిపోట్లు ఆమె సుకుమార దేహంపై కనిపించాయంటేనే అర్థం చేసుకోవచ్చు అతగాడి కర్కశత్వం, ఉన్మాదం ఎలాంటివో. 2012లో మెలిస్సాపై ఆమె బాయ్ ఫ్రెండ్ రాబర్ట్ లీ బర్టన్ జూనియర్ విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా, ముఖం, మెడ భాగాల్లో విచక్షణ రహితంగా పొడవడంతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. పారామెడికల్ విభాగంలో పనిచేస్తున్న కామెరాన్ హిల్ అత్యవసర కాల్ ను అందుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మెలిస్సాకు చకచకా ప్రథమ చికిత్స చేసి, హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆమె ప్రాణాలు నిలిపారు. హిల్ సకాలంలో మెలిస్సాను తీసుకురాబట్టే గండం గడిచింది. ఇక, హిల్ విషయానికొస్తే, తాను కాపాడిన మెలిస్సాతో పీకల్లోతు లవ్ లో మునిగిపోయాడు. దేవుడిలా తన ప్రాణాలు రక్షించిన హిల్ కు ఆమె అడ్డుచెప్పలేదు. ఇక, ప్రేమ తర్వాత పెళ్లేగా... అందుకు ప్రపోజ్ చేయాలిగా. దీంతో, ఫ్లోరిడాలో జరిగే ఓ బేస్ బాల్ మ్యాచ్ ను ఎంచుకున్నాడు హిల్. ఆ మ్యాచ్ కు టాస్ వేసే అవకాశం మెలిస్సాకు లభించింది. ఆమె పిచ్ పైకి రాగానే, హిల్ కూడా వెళ్లి మోకాలిపై కూర్చుని అర్థిస్తున్నట్టుగా పోజు పెట్టాడు. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని రాసున్న ఓ బేస్ బాల్ బంతిని చేతిలో పెట్టాడు. ప్రియుడి నుంచి వినూత్న తరహాలో ప్రపోజ్ ఎదురుకావడంతో మెలిస్సా సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. చివరికి గొంతు పెగల్చుకుని "యస్" అని చెప్పడంతో, హిల్ సంగతి అటుంచి, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. అన్నట్టు... మెలిస్సాపై దాడిచేసిన బర్టన్ జూనియర్ కు జీవితఖైదు విధించారు.