: బుద్ధిస్టులకు కోపం తెప్పించిన హాలీవుడ్ సుందరాంగి
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వీపుపై వేయించుకున్న ఓ టాటూ బౌద్ధ మతస్తుల ఆగ్రహానికి కారణమైంది. పురాతన్ ఖమేర్ లిపిలో ఉన్న ఆ టాటూ ఎంతో పవిత్రమైనదని, జోలీ దాన్ని అగౌరవపరిచారని థాయ్ లాండ్ లోని బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. 2003లో ఆమె థాయ్ టాటూ మాస్టర్ నూ కాంపాయ్ తో ఈ టాటూ వేయించుకున్నారు. అయితే, థాయ్ సంస్కృతి ప్రకారం మానవ దేహంలో తల మాత్రమే పవిత్రమైనది. దాంతో, మిగతా భాగాలపై మతపరమైన టాటూలు వేయించుకోవడం, విశ్వాసాలను కించపరచడమేనని అక్కడి వారు భావిస్తారు. జోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నటి కావడంతో, ఆమెను చూసి ఎందరో వేలంవెర్రిగా ఆ టాటూను వేయించుకునేందుకు ఎగబడతారని బౌద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ టాటూలో ఉన్న వాక్యాల మహత్మ్యం పాశ్చాత్యులకు అర్థం కావడంలేదని అన్నారు. ఇటువంటి టాటూలపై నిషేధం విధించాలని వారు కోరుతున్నారు. బుద్ధుడిని టాటూల రూపంలో, అలంకరణల రూపంలో ఉపయోగించడం తప్పు అంటూ రాజధాని బ్యాంకాక్ లో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.