: ఆప్ఘన్ మిలటరీ యోధుడికి భారతీయుడి చేతులు
ఆఫ్ఘనిస్థాన్ సైన్యంలో కెప్టెన్ గా సేవలందిస్తూ ప్రమాదంలో రెండు చేతులూ పోగొట్టుకున్న అధికారికి ఓ భారతీయుడు తన చేతులను దానం చేశాడు. కాందహార్ సమీపంలో ల్యాండ్ మైన్స్ తొలగిస్తున్న సమయంలో అవి పేలి అబ్దుల్ రహీమ్ (30) అనే మిలటరీ కెప్టెన్ తన రెండు చేతులనూ పోగొట్టుకున్నాడు. తిరిగి చేతులను అమర్చుకోవాలన్న కోరికతో ఎన్నో దేశాలు తిరిగాడు. చివరికి కొచ్చిలోని అమృతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సంప్రదించాడు. బ్రెయిన్ డెడ్ అయిన 54 సంవత్సరాల వ్యక్తి చేతులను అబ్దుల్ కు అమర్చడంలో వైద్యులు విజయవంతమయ్యారు. సుమారు 20 మంది వైద్యులు, 8 మంది అనెస్తెటిస్టులు 15 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి చేతులను అమర్చారు. దీంతో అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న తొలి ఆప్ఘన్ వ్యక్తిగానూ అబ్దుల్ నిలిచాడు. ప్రస్తుతం అతని రెండు చేతులూ కొద్దికొద్దిగా స్పందిస్తున్నాయట. మరో 10 నెలల పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటే పూర్తి స్థాయిలో పనిచేస్తాయని వైద్యులు భరోసా ఇస్తున్నారు.