: టిఫిన్ లోకి మళ్లీ చట్నీ అడిగాడని 'ఐసీయూ'లో చేరేలా కొట్టాడు
ఫైవ్ స్టార్ హోటల్ అయినా, రోడ్డు పక్కనుండే కాకా హోటల్ అయినా టిఫిన్ లో చట్నీ అయిపోతే అడగడం సర్వసాధారణం. మళ్లీ చట్నీ వేస్తారు కూడా...కానీ ఢిల్లీలోని ఓ కాకాహోటల్ యజమాని టిఫిన్ లోకి చట్నీ రెండోసారి కావాలని అడిగిన కస్టమర్ పై రాడ్డుతో దాడిచేసి ఆసుపత్రి పాలుచేశాడు. న్యూఢిల్లీలోని త్రిలోక్ పురి బ్లాక్ నెంబర్ 31లో సన్నీ అనే యువకుడు స్నేహితులతో కలిసి నిన్న సాయంత్రం రోడ్డుపక్కనున్న కాకా హోటల్ కు టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. టిఫిన్ మధ్యలో చట్నీ అయిపోవడంతో హాటల్ యజమాని కమల్ ని చట్నీ వేయాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన కమల్ ఐరన్ రాడ్డుతో సన్నీని చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన సన్నీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని స్నేహితులు అతడ్ని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సన్నీ స్నేహితుల ఫిర్యాదుతో కమల్ పై పోలీసులు కేసు నమోదు చేయగా, చెట్నీ వృధా చేయవద్దని చెప్పినందుకు వాగ్వాదానికి దిగారని, అతని స్నేహితులు కూడా వినిపించుకోలేదని పేర్కొంటూ సన్నీ, అతని స్నేహితులపై కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.