: ఆయన తినరు... మమ్మల్ని తిననివ్వరు: మోదీపై జోకేసిన వెంకయ్య
"ప్రధాని మోదీ, ఆయన తినరు... మమ్మల్ని తిననివ్వరు" అని ఇతర పార్టీలు వాపోతున్నాయని, తనవరకూ మాత్రం "ఆయన నిద్రపోరు, నన్ను నిద్రపోనివ్వరు" అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చలోక్తి విసిరారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, తానిక జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన వెనుక గాంధీ, నెహ్రూ కుటుంబాలు లేవని, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కష్టించి పనిచేసి ఎదిగానని తెలిపారు. ప్రస్తుత రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని, కొందరు ఎంపీలు లోక్‌సభకు విహార యాత్రకు వచ్చినట్టు వస్తున్నారని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తదుపరి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడిని ఎంపిక చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తానిక ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.