: నువ్వెంతంటే, నువ్వెంత అనుకున్న కోదండరాం, పిట్టల రవీందర్
సుదీర్ఘ విరామం తరువాత టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం హైదరాబాదు, టీఎన్జీవో భవన్ లో వాడివేడిగా జరిగింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రనేతలపై ఇలాంటి చర్చలు నడిచేవి. ఈసారి గంటన్నర సేపు సమావేశమైన టీజేఏసీ ఘాటైన ఆరోపణలు, పదునైన విమర్శలతో ముగిసింది. అజెండాలో భాగంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించడంతో మండిపడ్డ ఓ సభ్యుడు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాడు. రాష్ట్రం వచ్చిన ఏడాదిలో ప్రజలు ఏం బాగుపడ్డారని నిలదీశాడు. ఏం సాధించామని ఉత్సవాలు చేసుకోవాలని ప్రశ్నించాడు. దీంతో కాసేపు వాడివేడి చర్చ జరిగింది. అనంతరం టీజేఏసీకి చెందిన కొందరు నేతలు కొత్తగా పెట్టిన టీయూవీ సమావేశానికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఒక సంఘంలో కొనసాగుతూ మరో సంఘం సమావేశానికి ఎలా వెళ్లారని అడిగారు. దీనిపై జోక్యం చేసుకున్న కోదండరాం, 'వద్దంటున్నా ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వండి' అని టీజేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్ ను కోరారు. దీనిపై మండిపడ్డ రవీందర్ తాను వివరణ ఇవ్వాల్సి వస్తే, మరిన్ని విషయాలకు వివరణ కావాలని కోరుతానని అంటూ, మిషన్ కాకతీయలో కోదండరాం ఎత్తిన మట్టి ఏ శవాల మీద పోస్తారని అడుగుతున్నారని, దానికి వివరణ ఏదని నిలదీశారు. మానుకోటలో గాయపడిన 13 మందికి ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కొండా దంపతులు టీఆర్ఎస్ లో చేరినప్పుడు ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. రైతు జేఏసీలో ఎందుకు భాగస్వాములయ్యారని ఆయన నిలదీశారు. ఉద్యమకారులను గుర్తించాలని టీజేఏసీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు. జేఏసీ ఒక్క పిలుపునిస్తే రోడ్లపైకి వచ్చి దెబ్బలుతిన్న వారి గురించి ఎందుకు పట్టించుకోలేదని, ఉద్యమం చేయని వారు పదవులు అనుభవిస్తుంటే జేఏసీ ఏం చేసిందని ఆయన నిలదీశారు. దీనికి 'పదవుల కోసం ఉద్యమం చేయలేదు కదా?' అని కోదండరాం అన్నప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా 'పదవులు వద్దు, తెలంగాణ వస్తే చాల'ని అనలేదా? అని గతం గుర్తు చేశారు. మరి కుటుంబం మొత్తం పదవులు ఎందుకు అనుభవిస్తోందని ఆయన అడిగారు. టీయూవీ మీటింగ్ కు ఎందుకు వెళ్లావని తనను వివరణ అడుగుతున్న కోదండరాం, టీజేఏసీ ఛైర్మన్ గా ఉండి, ఇంకో జేఏసీ మీటింగ్ కు ఎందుకు వెళ్లారని ఆయన నిలదీశారు. ఓపెన్ కాస్ట్ గనులపై ఎందుకు స్పందించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనిని తట్టుకోలేకపోయిన కోదండరాం, పిట్టల రవీందర్ ను బయటికెళ్లాలని నాలుగైదు సార్లు కోరారు. అయినప్పటికీ ఆయన బయటకి వెళ్లకపోవడం విశేషం!