: గేల్ ప్రారంభిస్తే...కోహ్లీ ముగించేశాడు
అభిమానులకు టీ20 మజాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాదు జట్లు రుచి చూపించాయి. బంతి బంతికి మారిన ఉత్కంఠను క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు. ఓ బంతి బెంగళూరు విజయావకాశాలు పెంచితే, మరోబంతి హైదరాబాదు విజయావకాశాలు రుచిచూపింది. ప్లేఆఫ్ కు కీలకమైన ఈ మ్యాచ్ లో రెండు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా రాణించి క్రికెట్ ను గెలిపించారు. హైదరాబాదు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ను డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో 11 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ గెలిచిన హైదరాబాదు జట్టు బ్యాటింగ్ కు దిగింది. వార్నర్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా, కేవలం 8 పరుగులు చేసిన ధావన్ నేరుగా ధిండాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో అభిమానులు నిరాశ చెందినా, తరువాత వచ్చిన హెన్రిక్స్ బెంగళూరు బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీ లైన్ దాటించాడు. దీంతో కేవలం 20 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో వార్నర్ 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో దిగిన మోర్గాన్ కూడా 11 పరుగులు చేయడంతో 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు 135 పరుగులు చేసింది. ఇంతలో మరోసారి వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. అనంతరం డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో 6 ఓవర్లకు 81 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించి బెంగళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించారు అంపైర్లు. బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుందా? అనే ఉత్కంఠ అందర్లోనూ రేగింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ కు దిగిన గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు. స్టెయిన్ వేసిన తొలి ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు. అనంతరం భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నాడు. అనంతరం వచ్చిన హెన్రిక్స్ అద్భుతమైన బంతితో గేల్ (35)ను మట్టికరిపించాడు. గేల్ ప్రారంభించిన విధ్వంసాన్ని కెప్టెన్ కోహ్లీ పూర్తి చేశాడు. గేల్ క్రీజులో ఉన్నంత వరకు ప్రభావం చూపని కోహ్లీ తరువాత శివాలెత్తాడు. పద్ధతి ప్రకారం షాట్లు ఆడుతూ విజయం సాధించాడు. చివరి ఓవర్లో రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో కొట్టిన భారీ షాట్ ను ఒడిసిపట్టుకున్న వార్నర్ చివరి క్షణంలో బౌండరీ లైన్ ను తొక్కడంతో బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.