: రైతుల్ని అనాథల్ని చేయడమే మోదీ లక్ష్యం...అందుకే భూసేకరణ చట్టం: రాహుల్


భూసేకరణ పేరిట రైతుల భూములు లాక్కుని వారిని అనాథలను చేయడమే మోదీ ప్రభుత్వం లక్ష్యమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ లో ఆయన మాట్లాడుతూ, రైతుల నుంచి భూములు లాక్కోవడమే లక్ష్యంగా ఎన్డీయే బిల్లు తీసుకొస్తోందని అన్నారు. ఇలా రైతుల నుంచి భూమిని లాక్కుంటే దాని ప్రభావం ఆయా కుటుంబాలపై తీవ్రంగా చూపుతుందని ఆయన చెప్పారు. ఎన్డీయే ప్రవేశపెట్టనున్న భూసేకరణ చట్టం ప్రకారం భూములు లాక్కునేందుకు యజమాని అనుమతి అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఒకసారి రైతుల నుంచి భూమి సేకరించిన అనంతరం సంబంధిత పనులు 5 లేక 10 ఏళ్లు ప్రారంభం కాకపోయినా ఆ భూములు రైతులకు చెందవని అలా బీళ్లుగా మిగిలి పోవాల్సిందేనని, అవి పారిశ్రామిక వేత్తల పరమైపోతాయని ఆయన చెప్పారు. రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ ఎన్డీయే సర్కారు వారి భూములను లూటీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. భూసేకరణ బిల్లు ప్రకారం ప్రజలను సంప్రదించాల్సిన అవసరం లేదని, కనీసం ప్రశ్నించే హక్కు కూడా ఉండదని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లక్షల ఎకరాల భూములు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు వాటిని వినియోగించుకోవడం లేదని, రైతుల భూములు లాక్కునేందుకు మాత్రం పథకాలు రచిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News