: రైతు రుణమాఫీ మాతోనే ప్రారంభమైంది: రాహుల్ గాంధీ
రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రారంభమయిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ లో ఆయన మాట్లాడుతూ, తామంతా కేవలం ఈ రోజే ఎండలోకి వచ్చాము కానీ, రైతు ప్రతి రోజూ ఎండలోనే పని చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా రైతుల సంక్షేమం గురించి ఆలోచించేదని ఆయన చెప్పారు. యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయం 8 శాతం వృద్ధి నమోదు చేసిందని ఆయన వెల్లడించారు. యూపీఏ అధికారంలో ఉండగా భూమి రైతుల ఆధ్వర్యంలోనే ఉండాలని భావించామని, దానిని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టాలని భావించలేదని ఆయన పరోక్షంగా మోదీ ప్రభుత్వాన్ని దెప్పిపొడిచారు. అందుకు తగ్గట్టే 2013లో భూసేకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. భవిష్యత్ తరాలు భూమి ద్వారా అందే ఫలసాయం అనుభవించాలని, లేదా, దాని ద్వారా లభ్యమయ్యే ఇతర ప్రయోజనాలు రైతే అనుభవించాలని భావించామని ఆయన చెప్పారు. భూమి సేకరించాలని ప్రభుత్వాలు భావించినా రైతుల అనుమతితోనే జరగాలని ఆ బిల్లులో స్పష్టం చేశామని ఆయన చెప్పారు. దానికి తగ్గట్టుగా చట్టాలు కూడా చేశామని ఆయన తెలిపారు.