: మోదీ సూటు గురించి విమర్శిస్తున్నారు... గాంధీ, నెహ్రూలు సూటు వేసుకోలేదా?: వెంకయ్యనాయుడు
తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని... అప్పుడు పాదయాత్రలు చేయని రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో, భూసేకరణ చట్టంపై అనవసరంగా కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నాటి భూసేకరణ చట్టం కింద లక్షల ఎకరాలు సేకరించిన కాంగ్రెస్... ఇప్పుడు ఈ భూసేకరణ చట్టానికి ఎందుకు అడ్డం పడుతోందని ప్రశ్నించారు. అభివృద్ధి కుంటుపడకుండా చూడాలన్న లక్ష్యంతోనే తాము భూసేకరణ చట్టానికి సవరణ చేస్తున్నామని చెప్పారు. బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా పనిచేసింది యూపీఏ ప్రభుత్వమే అని వెంకయ్య మండిపడ్డారు. మోదీ సూటు వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని... గాంధీ, నెహ్రూలు కూడా సూటు వేసుకున్నారన్న సంగతి వారు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.