: 3.30 గంటల్లో 5 కుటుంబాలకు పరామర్శ...15 కి.మీ.నడక: ముగిసిన రాహుల్ యాత్ర


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన రైతు భరోసా యాత్ర కాసేపటి క్రితం ముగిసింది. ఆదిలాబాదు జిల్లా కొరిటికల్ గ్రామంలో మొదలైన రాహుల్ పాదయాత్ర లక్ష్మణ చందా, పొట్టుపల్లి, రాచాపూర్ ల మీదుగా కొద్దిసేపటి క్రితం వడియాల్ చేరుకుంది. వడియాల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన బహిరంగ సభావేదికకు చేరుకున్నారు. ఐదు గ్రామాల్లో సాగిన యాత్రలో రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్నందించారు. పనిలో పనిగా గల్ఫ్ లో మృత్యువాతపడ్డ ఓ బాధితుడి కుటుంబాన్ని కూడా రాహుల్ పలుకరించారు. నేటి ఉదయం నిర్మల్ నుంచి కారులో కొరిటికల్ చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి వడివడిగా పాదయాత్ర చేశారు. కేవలం మూడున్నర గంటల్లోనే ఆయన 15 కిలో మీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News